ఇందాకే “పంచాయితీ రాజ్” శాఖామాత్యులు (సినిమటోగ్రఫీ మంత్రి కాదు) అయినటువంటి బొత్స సత్యనారాయణగారు మగధీర సినిమాని విజయనగరం జిల్లా మొత్తం బ్యాన్ చేస్తున్నట్టు అధికారులకి ఆదేశాలు పంపించారు. విజయనగరం లోని కొన్ని థియేటర్లలో దురదృష్టవశాత్తూ జరిగిన కొన్ని సంఘటనల్లో కొంతమది బలికావడం దారుణమైన విషయమే. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక టీమ్‌ని వేసి వాళ్ళు విజయనగరం జిల్లాలోని అన్ని థియేటర్లు పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చినతర్వాత మగధీర సినిమాని మళ్ళీ ప్రదర్శించడానికి అనుమతినిస్తామని బొత్సగారు చెప్పారు.
అయితే ఇక్కడ కొన్ని సందేహాలేంటంటే-
1. ఢిల్లీ లో లగాన్ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ప్రమాదం జరిగిందనుకుందాం. ఆ థియేటర్ ని సీజ్ చేయాలా లేక దేశవ్యాప్తంగా లగాన్ సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలో లగాన్ సినిమాని బ్యాన్ చేయాలా?
2. ఒక సినిమాని ఒక జిల్లా మొత్తం బ్యాన్ చేసిన సంఘటన నాకు తెలిసి తెలుగులో ఇదే ప్రథమం. “థియేటర్ ని సీజ్ చేయడం” వేరు. “సినిమాని బ్యాన్ చేయడం వేరు”. థియేటర్లలో భద్రతాప్రమాణాలు లేకపోతే “థియేటర్ ని సీజ్ చేయాలా” లేక “సినిమాని బ్యాన్ చేయాలా”. సాధారణంగా సినిమాని బ్యాన్ చేయడం అనేది ఆ సినిమాలో దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే లేదా దేశప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలుంటే, అలాంటి సినిమాలని బ్యాన్ చేస్తారు. ఒకవేళ సినిమాని బ్యాన్ చేయడం సబబే అయితే బొత్సగారు రాష్ట్రానికి మంత్రి, విజయనగరం జిల్లాకి మాత్రమే కాదు. కాబట్టి అలాంటి పరిస్థితే ఉంటే ఎందుకు రాష్ట్రం మొత్తం బ్యాన్ చేయలేదు.
3. థియేటర్ల భద్రత ప్రమాణాలు పరిశీలించడం ప్రభుత్వం భాద్యతా లేక చిత్ర యూనిట్ దా?
4. సినిమటోగ్రఫీ మంత్రి చే ప్రకటన ఇప్పించిఉంటే రాజ్యాంగబద్దంగా ఉండేదేమో కానీ పంచాయితీశాఖామంత్రికి ఇలా సినిమాని బ్యాన్ చేయమని ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా?
5. పోయినప్రాణాలు ఎవరూ తిరిగి తెచ్చి ఇవ్వలేరు. కాబట్టి ప్రభుత్వం థియేటర్లమీద కొరడా ఝళిపించడం మంచి పరిణామమే. కానీ కేవలం మగధీర ని మాత్రమే బ్యాన్ చేయడం కాకుండా రేపు రిలీజ్ అవనున్న (బొత్స సత్యనారాయణ పి.ఎ. అయిన కమెడియన్ గణేష్ నిర్మిస్తున్న – నిజానికి గణేష్ కేవలం డమ్మీయే, బొత్సగారే అసలు నిర్మాత అని రూమర్స్ ఉన్న) ఆంజనేయులు సినిమాని కూడా బ్యాన్ చేసి ఉండాల్సింది. ఎందుకు ఆంజనేయులు ని బ్యాన్ చేయలేదు.
ఇంకా చాలా ఉన్నాయి సమాధానాలు వెతకనవసరం లేని ప్రశ్నలు
No comments:
Post a Comment